కాసు బాగు భూ బాధితులకు అండగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ప్రతిఘటన, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య
రైతులకు తమ భూముల్లో వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలని, తక్షణమే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోనీ నాదర్ గుల్ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం చూసి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసుబాగు (శివరాజ్ బహదూర్) భూముల విషయంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న పోరాటంపై ఆమె స్పందించారు. కాసుబాగు భూముల్లో రైతులతో సహా పర్యటించి అక్కడ ఎండిన పంటలను, వ్యవసాయం కోసం ఉపయోగించిన బోర్లను, లోపల ఉన్న కుంటలను పరిశీలించారు. ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా వారికి అండగా ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలోనే నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా, అనంతరం స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ భూములను స్పష్టంగా ప్రభుత్వ భూములుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వివాదంపై కోర్టులు కూడా స్పష్టత ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. హై కోర్ట్ సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ రెండూ.. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవేనని చెప్పినప్పటికీ, ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు కొనసాగుతుందని “ప్రభుత్వం చెబుతోంది… కోర్టులు చెబుతున్నాయి.. అయితే ఇక్కడ ప్రైవేట్ వాళ్లు ఎవరు? ఎవరు ధైర్యం ఇచ్చారు? ఎవరి అండతో రైతులను భయపెడుతున్నారు?” అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. సుమారు 375 ఎకరాల భూమి, 600కి పైగా రైతు కుటుంబాలు ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నారని, ప్రతి కుటుంబం 1 నుంచి 3 ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నాయని చెప్పారు. రైతులను వారి భూముల్లోకి వెళ్లనివ్వకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేసి అడ్డుకోవడం తీవ్ర అన్యాయమని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు. మంత్రులు, కలెక్టర్ కూడా ఇవి ప్రభుత్వ భూములేనని చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరమని విమర్శించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే రైతుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతు బ్రతికితేనే దేశం బతుకుతుంది… రైతు గెలిస్తేనే న్యాయం గెలుస్తుంది అని ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా, కాసుబాగు భూ బాధితుల పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతూ, న్యాయపరంగా, చట్టపరంగా అన్ని విధాల సహకరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాదర్ గుల్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు, కాసుబాగు భూ బాధితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
