ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణయథేచ్చగా చిట్ ఫండ్స్ మోసాలు

యథేచ్చగా చిట్ ఫండ్స్ మోసాలు

📰 Generate e-Paper Clip

గ్రేటర్ పరిధిలో పుట్టగొడుగుల్లా చిట్ ఫండ్స్ కంపెనీలు

పట్టించుకోని రిజిస్ట్రార్ శాఖ అధికారులు

మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు ఆరోపణలు

జీఎస్టీ, పెనాల్టీ ల పేరుతో చీటీ డబ్బులలో 40% కోత

మోసపోతున్న చిట్ సభ్యులు

ప్రతిఘటన, చీఫ్ ఎడిటర్ రాజు :

గ్రేటర్ పరిధిలో చిట్ ఫండ్స్ కంపెనీల అక్రమాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. జీరో చిట్స్ దందాను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన చిట్ రిజిస్ట్రార్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో చిట్ సభ్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య, మధ్యతరగతికి చెందిన వారు నెల నెల కొంత మొత్తాన్ని పొదుపు చేసి చిట్స్ వేస్తుంటారు. అవసరాలకు ఉపయోగపడతాయని ఆశించి చిట్స్ లో చేరిన సభ్యులకు సకాలంలో డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సందర్భాలలో ప్రవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పుగా డబ్బులు తీసుకుని చెల్లించలేక ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. మరింత అప్పుల పాలవుతున్నారు. ఫలానా చిట్ ఫండ్స్ లో మోసం జరిగిందని, తనకు రావాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించడంలేదని ఎవరైనా చిట్స్ రిజిస్ట్రార్ అధికారుల వద్దకు వెళితే కనీసం ఫిర్యాదు తీసుకోవడం లేదని, ఫిర్యాదు చేస్తే ఏమొస్తుంది? వారితో మాట్లాడిస్తా.. పరిష్కరించుకో అంటూ ఉచిత సలహా ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

నిబంధనల ఉల్లంఘన

చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీల నిర్వహణ లావాదేవీలను చట్టబద్ధం చేయడానికి రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయం పని చేస్తుంటుంది. చిట్ ఫండ్స్ లో నిర్వహించే అన్ని చిట్స్ ను చట్టబద్ధం చేయడానికి ప్రత్యేకంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక చిట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉంటారు. జిల్లాలోని అన్ని చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలలో ఆర్థిక లావాదేవీలు చట్టబద్ధంగా జరిగే విధంగా ఈ చిట్స్ రిజిస్ట్రార్ బాధ్యత. రెగ్యులర్ గా చిట్ ఫండ్స్ లావాదేవీలను తనిఖీలు చేసి అక్రమాలు చోటు చేసుకుంటే ఆ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు చేయడమే కాకుండా సంస్థకు చెందిన ఆస్తులను సీజ్ చేసి బాధితులకు చెల్లించే విధంగా న్యాయం అందించే అధికారం చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కు, జిల్లా రిజిస్ట్రార్ లకు ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జరుగుతున్నది అందుకు విరుద్ధంగా ఉంది. వాస్తవంగా గ్రేటర్ పరిధిలో వందలాది చిట్ ఫండ్స్ సంస్థలున్నాయి. ఈ చిట్ ఫండ్స్ కంపెనీలలో తనిఖీలు నిర్వహించి లావాదేవీలకు చట్టబద్ధత కల్పించే బాధ్యత చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అధికారులదే. కానీ ఏనాడు గ్రేటర్ పరిధిలో ఏ ఒక్క చిట్ ఫండ్స్ కంపెనీలలో తనిఖీల కోసం వెళ్లడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. చిట్ ఫండ్స్ నిర్వాహకులే ప్రతి నెల వారి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయం తీసుకువచ్చి తాము రిజిస్టర్ అయినా చిట్స్ నే నడుపుతున్నామని మినిట్స్ సమర్పిస్తున్నట్టు తెలిసింది. ఈ రికార్డులతో పాటే ప్రతి నెల క్రమం తప్పకుండా మామూళ్లు ముట్ట చెబుతున్నారనే విమర్శలున్నాయి. అధికారికంగా నామమాత్రపు చిట్స్ ను రిజిష్టర్డ్ గా పేర్కొంటున్న ఈ చిట్ ఫండ్స్ సంస్థలు అంతకు రెట్టింపు సంఖ్యలో జీరో చిట్స్ ను నడుపుతున్నట్లు సమాచారం. ఈ విషయం చిట్స్ డబ్బులను సభ్యులకు చెల్లించే సమయంలో వచ్చిన తేడా సందర్భంలో బయటపడుతున్నట్లు తెలుస్తోంది. అప్పుడు అధికారులే బాధితులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. రిజిష్టర్డ్ చిట్ అని నిర్ధారించుకోకుండా ఎలా చిట్ సభ్యుడిగా చేరావు. అని ప్రశ్ని స్తూ బాధితులు ఫిర్యాదు చేయకుండా అడ్డుకుంటున్నారు.

చిట్ డబ్బులు సకాలంలో చెల్లించకుండా

చిట్ వేలం పూర్తి చేసిన తరువాత 45 రోజుల్లో చిట్ డబ్బులను సభ్యుడికి చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు షూరిటీలు, ఐటీ రిటర్న్స్, ఇతర ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ కాలయాపన చేస్తున్నారు. అవసరమైన అన్ని పత్రాలు, సంతకాలు ఒకేసారి తీసుకురావాలని చెప్పకుండా ఉద్దేశపూర్వకంగా ఒకటి తర్వాత మరొకటి పత్రం కావాలంటూ నెలలు గడుపుతూ మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు చిట్ డబ్బులు చెల్లించడం లేదని పలువురు సభ్యులు వాపోతున్నారు.

చిట్ మొత్తంలో 40% కోత

ఇక కొన్ని చిట్ ఫండ్స్ కంపెనీలు జీఎస్టీల పేరుతో, పెనాల్టీ ల పేరుతో చిట్ సభ్యుల చీటీ డబ్బులను కోత విధిస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. జీఎస్టీ నెంబర్ లేకున్నా.. ప్రభుత్వానికి ఎటువంటి పనులు చెల్లించకుండా సభ్యుల నుంచి వసూలు చేస్తున్నాయి. పైసా పైసా కూడా పెట్టిన సామాన్య, మధ్యతరగతి చీటీ సభ్యుల నుంచి జీఎస్టీ, పెనాల్టీ ల పేరుతో 40% పైగా దండుకుంటున్నాయి. ఇలాంటి చిట్ ఫండ్స్ కంపెనీలు గ్రేటర్ పరిధిలో వందలకు పైగా ఉన్నాయి. జీఎస్టీ అధికారులు కూడా చిక్ ఫండ్స్ సంస్థలపై నిఘా పెట్టకపోవడంతో వీళ్లు ఆడిందే.. ఆట.. పాడిందే పాటగా.. కొనసాగుతోంది. వీటిపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తే అధిక చిట్ ఫండ్స్ కంపెనీల గుట్టు రట్టురట్టవుతుంది. వీటిపై అధికారులు నిఘా పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

మరో చిట్ ఫండ్స్ కంపెనీ మోసాలపై పూర్తి కథనం.. రేపటి సంచికలో…

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!