వెలుగుమట్ల పేదలకు అండగా ఉంటాం
తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్
ప్రతిఘటన, ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆర్. శంకర్ నాయక్ సందర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు భూదాన భూముల్లో నిర్మించుకున్న ఇండ్లను ప్రభుత్వం తొలగించడం అన్యాయమన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లనే కూల్చడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ చర్య గాంధీజీ, వినోబాభావే ఆలోచనలకు విరుద్ధమన్నారు. కూల్చివేసిన స్థలంలోనే పేదలకు పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేదలకు న్యాయం జరిగే వరకు తెలంగాణ సర్వోదయ మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకూ పేదలకు తాము అండగా ఉంటామని తెలిపారు.
