న్యాయం కోసం రెండు దశాబాద్ధాల ఆరాటం..!
కనీస వసతులు కల్పించాలని
రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఉత్తర్వులు
హై కోర్టు ఆదేశాలు ఉన్న దక్కని న్యాయం
ఆదిభట్ల భూదాన్ ప్లాట్ల లబ్ధిదారుల 20 ఏళ్ల గోస..!
కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా.. చిరకాల కల నెరవేరేనా..?
ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి : పేదలకు పంచిన భూదాన్ భూముల్లో ప్లాట్లపై ఆశలు పెంచుకున్న పేదలు గత రెండు దశాబ్ధాలకుపైగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005లో భూదాన్ యజ్ఞబోర్డ్ రంగారెడ్డి జిల్లా, ఇబ్రాహీంపట్నం మండలం ఆదిభట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం: 51, 52, 53 లోని దాదాపు 70 ఎకరాలకు భూదాన్ భూమిలో లే ఔట్ చేసి 963 మంది పేదలను గుర్తించి 150 చ.గజాల చోప్పున ప్రొసిడింగ్లు జారీ చేసింది. ఆ ప్రొసింగ్ల ఆధారంగా అప్పటి ఇబ్రహీంప్రట్నం మండల తహసీల్ధార్ కూడా పట్టాలు జారీ చేశారు. పట్టాలు జారీ కావడంతో లబ్ధిదారులంతా తమ సొంతింటి చిరకాల కల నెరవేరబోతుందని ఎంతో ఆశపడ్డారు. కానీ.. అంతలోనే వాళ్ల ఆశలు అడియాసలు అయ్యాయి. పారిశ్రామిక వాడల కోసం అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన సెజ్‌లు (పరిశ్రమల కోసం భూసేకరణ) శాపంగా మారాయి. భూదాన్ గ్రామ దాన్ యాక్ట్ (చట్టం) ప్రకారం భూదాన్ భూములపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అజమాయిషీ ఉండదు. చట్ట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భూదాన్ భూములను ఎట్టి పరిస్థితులలో సేకరించకూడదు. వాటి జోలికి వెళ్లకూడదు. అంత పకడ్బందిగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసింది. కానీ భూదాన్ గ్రామ దాన్ చట్టాన్ని తుంగలో తొక్కి 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ప్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) పేరుతో ఆదిభట్లలోని భూదాన్ భూమిని సైతం సెజ్‌లో చేర్చింది. ఈ భూమి పక్కనే ఏరో స్పెస్‌కు వందల ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూదాన్ భూమిలోని కొంత భాగం ప్లాట్లు కూడా ఏరోస్పేస్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఆదిభట్ల భూములను ఏపీఐఐసీ పేరుతో స్వాధీనం చేసుకొని పేదల ఆశలపై నీళ్లు చల్లింది. కన్నీళ్లతో అప్పటి నుండి భూదాన్ భూమిలో ప్లాట్లు పొందిన లబ్ధిదారులు ఇప్పటికీ 2 దశాబ్ధాలకుపైగా అలుపెరుగని పోరాటం చేస్తునే ఉన్నారు.
హైకోర్టు ఆర్డర్ సైతం భేఖాతర్..!
సొంతింటి కళపై ఆశలు చంపుకోని ఆదిభట్ల భూదాన్ ప్లాట్ల లబ్ధిదారులు అంతా ఏకమై ఆచార్య వినోభ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో సంఘటితమయ్యారు. తమకు న్యాయం చేయాలని 2022 ఏప్రీల్ నెలలో రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు అదే ఏడాది ఆర్డర్ నెం: డబ్ల్యూపీ నెం:17201/2022 జారీ చేసి ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆదిబట్ల భూదాన్ భూములలో ప్లాట్లు పొందిన లబ్ధిదారులకు డ్రైనేజీ, విధ్యుత్, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలతో పాటు ఇండ్ల నిర్మాణం కోసం వసతులు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ.. గౌరవ హైకోర్టు ఉత్తర్వలను సైతం అప్పటి ప్రభుత్వం, అధికారులు భేఖాతరు చేశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులు బుట్టదాఖలు చేశారు. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఆదిభట్ల భూదాన్ భూముల ప్లాట్ల లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికైనా న్యాయం చేయండి
ఆదిభట్ల భూదాన్ భూముల ప్లాట్ల లబ్ధిదారుల సంఘం ఆచార్య వినోభా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరుపున గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నాం. పేదలకు కేటాయించిన భూదాన్ ప్లాట్లను అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2007లో సెజ్‌ల పేరుతో భూదాన్ భూములకు కూడా పరిశ్రమల కోసం స్వాధీనం చేసుకుంది. అప్పుడు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భూదాన్ భూములలో ఇచ్చిన ప్రొసిడింగ్‌లను, మండల కార్యాలయం నుండి పొందిన పట్టా సర్టిఫికెట్లను కూడా పరిగణంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కు అప్పగించింది. ఇక అప్పటి నుండి మా పోరాటం జరుగుతూనే ఉంది. సొంతి ఆశ మమ్మళ్లి ఇంకా పోరాటం వైపు నడిపిస్తునే ఉంది. చివరికి 2022 లో గౌరవ రాష్ట్ర హైకోర్టు మా తరుపున న్యాయమైన తీర్పును వెల్లడించింది. కానీ అధికారులు ఉన్నత న్యాయస్థానం తీర్పును సైతం భేఖాతరు చేశారు. కోర్టు ఉత్తర్వలను సైతనం పట్టించుకోలేదు. ఇప్పటికై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతోందిని ఆశగా ఉన్నాం. మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి న్యాయం చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు కూడా వినతి పత్రం అందజేశాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.

దార మంజులు
అధ్యక్షురాలు
ఆచార్య వినోభ నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్
