చిద్రమై అధ్వానంగా రాళ్లు తేలి గుంతలమయమైన రహదారి
జల్ పల్లి మున్సిపాలిటీ జీహెచ్ఎంసీగా మారిన సందర్భంలో నైనా రోడ్డు అభివృద్ధి అవుతుందని కాలనీ వాసులు ఎదురు చూస్తున్నారు
ప్రతిఘటన, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య
అధికారుల, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో రోడ్లు మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా తయారవుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాళ్లు తేలిన రహదారితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, కనీస సౌకర్యాలు లేక జీహెచ్ఎంసీ జల్ పల్లి డివిజన్ పరిధి, గ్రామ కాలనీలోని పోచమ్మ గుడి రహదారి, సింగానియా కంపెనీకీ వెళ్లే మొదటి గల్లీలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ రహదారిలో సైకిల్, ద్విచక్ర వాహనాలుకానీ, ఆటోలుగానీ, కార్లుగాని ప్రయాణించలేని పరిస్థితిలో ఉంది. గుంతల మయమైన రోడ్ల వల్ల ఈ రహదారిలో ప్రయాణించే విద్యార్థులు, వృద్ధులు పడి గాయాల పాలవుతున్నారు. ఈ రహదారిని చూస్తే రహదారి అంటే ఇంత అద్వానంగా ఉంటుందా..? అనే ప్రశ్నలు సంధిస్తారు. ఇది చూసినవారు నవ్వుకునే పరిస్థితికి దిగజారిపోతుంది. ఇక్కడ డ్రైనేజీ మాత్రం సింఘానియా కంపెనీ వాళ్ళు వేయించారని సమస్య లేదని కాలనీ వాసులు తెలిపారు. గతంలో పనిచేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులకు రహదారి సమస్య ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మట్టి పోసి వెళ్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు వరద దాటికి మట్టి కొట్టుకుపోయి మళ్లీ రహదారి అస్తవ్యస్తంగా రాళ్లు తేలి గుంతల మయంగా మారుతుందని కాలనీ వాసులు చెబుతున్నారు. మరమ్మతులు చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల అలసత్వం వహిస్తుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అధికారులకు, గతంలో ప్రాతినిత్యం వహించిన మాజీ ప్రజా ప్రతినిధులకి పలుమార్లు విన్నవించుకున్నా ఎవరు కూడా పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాధుడే లేడని ఆరోపిస్తున్నారు.
పట్టించుకున్న వారే లేరు
మల్లయ్య, శ్రీరామ కాలనీ వాసి
గత 20 సంవత్సరాలుగా రహదారి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. కాలనీ అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నారు. కానీ మా కాలనీ అదే మట్టి రహదారిపై ముందుకెళ్తుంది. ఎన్నికల సమయంలోనే నాయకులు తమ గ్రామానికి వస్తారు. ఓట్ల కోసం ముచ్చట్లాడి 3 నెలల్లోపు సీసీ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ఓట్లు పొందిన తరువాత మొహం చూపకుండా వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మా కాలనీలో రహదారి వేయించాలని కోరుతున్నాము.
ఇక్కడి నుంచి వెళ్లలేక చుట్టూ నడుచుకుంటూ స్కూల్ కి వెళ్తున్నాము
కోటి విద్యాలయ స్కూల్ విద్యార్థి కపిల్
నేను ఈ కాలనీలో ఉంటాను. కోటి విద్యాలయ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్నాను. నాతో పాటు చాలా మంది విద్యార్థులు కోటి స్కూల్లో చదువుకుంటున్నాము. ఈ రహదారిలో వెళ్లేటప్పుడు ఈ రాళ్లలో నడుచుకుంటూ కింద పడిపోతున్నాము. అందుకని చుట్టూ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లి స్కూల్ కి వెళ్తున్నాము. తొందరగా ఇంటికి వెళ్లాలని ఈ రహదారిలో వచ్చినప్పుడు కింద పడిపోతున్నాము. దోస్తులకు చాలా మందికి కింద పడి గాయాలయ్యాయి. రోడ్డు అభివృద్ధి చేయాలి. మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి స్కూలుకి పోయి రావాలంటే రోడ్డును అభివృద్ధి చేయించాలి.
