మహేశ్వరం, ప్రతిఘటన ప్రతినిధి ముత్తయ్య
హిందువులు పరమ పవిత్రంగా భావించే గోవులను వధించడంపై పోరాటం చేస్తామనీ, గోవులను తరలిస్తే ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకోమని మాజీ కౌన్సిలర్ బోధ యాదగిరి రెడ్డి, గోరక్షక్ విభాగ్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో గోరక్షక్ విభాగ్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు సంతల్లో దళారులు ఆవులను కొనుగోలు చేసి మినీ వ్యాన్లలో నగరానికి రవాణా చేరుస్తున్నారన్నారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఆయా సంతల నుంచి రాత్రి 10 గంటల తరువాత బయలుదేరి, తెల్లవారుజామున 3 గంటల్లోపు గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నారు. అనంతరం వాటిని జంతు వధశాలకు తరలిస్తున్నారని ఫిర్యాదుల పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలలో జనావాసాల మధ్యనే వధించి, గుట్టుచప్పుడు కాకుండా మాంసాన్ని పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నారన్నారని తెలిపారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే గోవులను హింసించడం, వధించడంపై హిందూత్వ సంఘాలతో పాటు గో పరిరక్షణ సంఘాల ప్రతినిధులు పోరాటం చేస్తున్నారన్నారు. గోవులను రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారని తెలిపారు. అయితే గోవుల రవాణా వెనుక బడా వ్యాపారులతో కూడిన మాఫియా ఉండడంతో.. పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి, తిరిగి కబేళాలకు తరలించేలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయన్నారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను అక్రమ రవాణా నుంచి రక్షించేందుకు వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వాటిని కాపాడి గోశాలలకు తరలించాలని కోరారు.
