ప్రతిఘటన, రాజేంద్ర నగర్ ప్రతినిధి హబీబ్
అత్తాపూర్ ప్రాంతంలో జహూర్ ఇక్బాల్ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. సద్దాం అనే యువకుడిని బైక్పై కిడ్నాప్ చేసి, చింతల్మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా దాడికి పాల్పడింది. సద్దాంపై పిడి గుద్దుల వర్షం కురిపించడంతో పాటు.. కర్రలతో విచక్షణారహితంగా చితకబాది తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయింది. అందరూ చూస్తుండగానే గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
సద్దాంను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
గ్యాంగ్ దాడిలో తీవ్రంగా గాయపడిన సద్దాంను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే గ్యాంగ్ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో ఉపయోగించిన కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై సద్దాం కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 25 మంది గ్యాంగ్ సభ్యులు ఈ దాడికి పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
