బీఎంపీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్
ప్రతి ఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్
కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని బహుజన్ ముక్తి పార్టీ మరియు సోషలిస్టు కూటమి, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకత్వానికి చూపుతున్న వివక్షత, అన్యాయంపై మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీఎంపీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ.. కల్వకుర్తి మున్సిపాలిటీలో వైఎస్ చైర్మన్ స్థానాన్ని 21వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ దళిత కౌన్సిలర్ మబ్బు రామరాజుకు ఇవ్వాల్సిన వైఎస్ చైర్మన్ స్థానాన్ని బీసీ మైనారిటీ నాయకునికి కేటాయించి, దళిత నాయకుని నోట్లో మట్టి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే 3 మున్సిపాలిటీలు ఉండగా చైర్మన్ స్థానం ఎస్సీలకు ఎక్కడ రిజర్వేషన్ కాలేదన్నారు. కనీసం వైఎస్ చైర్మన్ స్థానమైనా ఎస్సీలకు కేటాయించకుండా ఓసీలకు, లేదా బీసీలకు, మైనారిటీలకు మాత్రమే కేటాయిస్తూ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తూ అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీల నాయకత్వాన్ని బానిసలుగా మార్చుతున్నారన్నారు. రాష్ట్రంలోని 7 కార్పోరేషన్లకు,116 మున్సిపాలిటీలలో రిజర్వేషన్ స్థానాలలో వచ్చిన మేయర్, చైర్మన్ స్థానాలు మినహా ఎక్కడ కూడా, వైస్ మేయర్, వైస్ చైర్మన్ స్థానాన్ని ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చిన పరిస్థితి లేదంటే, ఎస్సీ, ఎస్టీలపై ఈ ప్రభుత్వం చూపుతున్న వివక్షత ఏమిటో ప్రజలకు అర్థం అవుతుందని ఇలాగే కొన సాగితే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద బెట్టే పరిస్థితి దగ్గరలో ఉందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జెడ్పీ చైర్మన్, వైస్ ఎంపీపీ, సహకార సంస్థల చైర్మన్ స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోషలిస్టు కూటమి రాష్ట్ర కార్యదర్శి జిలకర బాలస్వామి, దళిత దండు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎత్తపు చంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.
