శంషాబాద్ జోన్ డీసీపీ బీ. రాజేష్
డిజిటల్ అరెస్ట్ బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ లోన్ ఫ్రాడ్స్ మొదలైన వాటిపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి
ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
తెలియని లింక్‌లు క్లిక్ చేయకపోవడం, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోకపోవడం, అనుమానాస్పద కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని శంషాబాద్ జోన్ డీసీపీ బీ.రాజేష్, ఆర్జీఐఏ డివిజన్ శంషాబాద్ ఏసీపీ వీ. శ్రీకాంత్ గౌడ్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోవడంతో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో వివరించేందుకు పహాడీషరీఫ్ పోలీసులు తుక్కుగూడలో “సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు” ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పౌరులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, ఫిషింగ్ ఎటాక్స్, నకిలీ లింకులు, ఓటిపి, స్కామ్‌లు, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అరెస్ట్, లోన్ ఫ్రాడ్స్, మొదలైన వాటిపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి, సోషల్ మీడియా హ్యాకింగ్ గుర్తింపు దొంగతనం వంటి వివిధ రకాల సైబర్ నేరాల గురించి వారు ప్రజలకు వివరించారు. సైబర్ నేరాల నివారణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటిపిలు, బ్యాంకు వివరాలు లేదా పాస్‌వర్డ్‌లను షేర్ చేయకూడదని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం లేదా మోసపూరిత ఫోన్ కాల్‌లకు స్పందించడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్, హౌస్ అరెస్ట్ చేశామంటూ ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దు అంటూ భయపెడుతూ సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయలు లాగుతున్నారు అన్నారు. పౌరులలో సైబర్ అవగాహన కల్పించేందుకు బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తనను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన “సైబర్ మిత్ర” “సైబర్ సింహ” కార్యక్రమాల గురించి వారు ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా వాలంటీర్లు ప్రజలు సమాజంలో సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్ నంబర్ 1930 జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in) ను సంప్రదించాలని ఈ సందర్భంగా ప్రజలకు సమాచారం అందించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ ఎస్సైలు దయాకర్ రెడ్డి, లక్ష్మయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
