అభివృద్ధి పేరుతో ప్రజా ధనం వృధా..
పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం
జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకుల డిమాండ్
ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్
మల్దకల్ మండలంలోని ఉలిగేపల్లి గ్రామంలో పాలకుల నిర్లక్ష్యంతో గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యత తీవ్రంగా లోపించిందని నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ నాయకులు ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని పాలకులు వృధా చేస్తున్నారని, గత రెండు రోజుల క్రితం గ్రామంలో నాణ్యత లేని సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. నాసిరకం మెటీరియల్ తో రోడ్లు వేసిన రెండు రోజులకే కంకర తేలిపోవడం, పగుళ్లు వచ్చి నాణ్యత లోపించిందన్నారు. దీంతో గ్రామంలో ఎలాంటి నాణ్యత లేకుండా హడావుడిగా రోడ్ల నిర్మాణం పనులు ముగించడం వారి పాలనకు ఇదే నిదర్శనం అని తెలిపారు. నాసిరకం రోడ్లు వేయడం ద్వారా గ్రామంలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సమితి నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ నాయకులు లక్ష్మన్న, భూపతి నాయుడు, ఆశన్న, తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.
