ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ కన్న మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్ పేట్, జిల్లెలగూడలో ఇంటి పన్నులు అధికంగా వసూలు చేస్తున్నారని ఇంటి పన్నులు తగ్గించే వరకు రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తామని, వెనకడుగు వేసేది లేదని తాడో పేడో తెలుసుకుందామని వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లెలగూడ మాజీ ఉప సర్పంచ్ మేకల రవిందర్ రెడ్డి అన్నారు. ఆదివారం వంగ అనంతరెడ్డి గార్డెన్స్ లో కాలనీ అసోసియేషన్ నాయకులు , సభ్యులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ లేని విధంగా మన మీర్ పేట్ కార్పోరేషన్ లో మాత్రమే ఇంటి పన్నులు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ కన్న అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. ఎంతంటే రూ. 5000 ఉన్న ఇంటి పన్ను ఇప్పుడు రూ. 25,000 కట్టమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. కట్టకపోతే ప్రతి నెల 2% వడ్డీ వేసి మరీ వసూలు చేస్తామని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ విషయమై అధికారులకు, ప్రభుత్వానికి పలుమార్లు పన్నులు తగ్గించాలని మనవి చేసినా స్పందన లేదన్నారు. ఇప్పటికైన మనమంతా ఓ తీర్మానం చేసి ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరణ చేసి అధిక పన్నులు వసూలు చేస్తున్న విషయాన్ని మన జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్దామన్నారు. మనకు న్యాయం చేస్తారనే నమ్మకంతో పన్నులు తగ్గే వరకు ఉద్యమం చేద్దామన్నారు. ఇందులో జిల్లెలగూడ, మీర్ పేట్ ప్రజలు ప్రతి ఇంటికి కనీసం ఒక్కరైనా పాల్గొనాలని కోరారు. పన్నులు తగ్గించేంతవరకు ఎవరు కూడా ఇంటి పన్నులు చెల్లించొద్దు అన్నారు. మనందరం ఐక్య మత్యంగా ఉంటే అధికారులు దిగివచ్చి ఇంటి పన్నులు తగ్గిస్తారు అన్నారు. ఈ పోరాటం ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. ఏ పార్టీకి సంబంధం లేదన్నారు. పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ.. కాలనీలో గుర్రపు డెక్కతో దోమలతో నిరంతరం ఇబ్బంది పడుతున్నామన్నారు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. ప్రజలకు ఇంటి పన్నులు పెంచి డైరెక్ట్ గా ప్రజా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
ప్రజా దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం

ఏం. అంజయ్య, డి.ఎల్.ఆర్.ఎల్ కాలనీ, మీర్ పేట్
గతంలో ఎన్నడు లేని విధంగా ప్రస్తుతం అధికారులు ఇంటి పన్నులు అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రజా దోపిడీ చేస్తున్నారు. కాలనీ వాసులంతా సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చ. సంఘటితంగా ఒక్కటై ఉండి పోరాటం చేద్దాం. ఇంటి పన్నులు తగ్గించేంత వరకు ఎవరు కూడా ఇంటి పన్నులు చెల్లించవద్దు.
