prathighatana.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 2:29 pm Digital Edition : PRATHI GHATANA

విద్యుత్ షాక్ తో లక్ష్మణ్ నాయక్ మృతి

రంగనాయకుల కాలనీలో తీవ్ర విషాదం

విద్యుత్ శాఖ కార్యాలయం ముందు మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన

ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

లక్ష్మణ్ నాయక్ మృతితో రంగనాయకుల కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. జల్ పల్లి డివిజన్ మామిడిపల్లి రంగనాయకుల కాలనీకి చెందిన లక్ష్మణ్ నాయక్ గత 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వర్కర్ గా పని చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా మామిడిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు పని చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. హుటాహుటిన తుక్కుగూడలోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. లక్ష్మణ్ నాయక్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు . ప్రస్తుతం లక్ష్మణ్ నాయక్ మృతి చెందడంతో అతనికి ముగ్గురు పిల్లలు, భార్య, తల్లి గుండెలు పగిలేలా రోదించడం అందర్నీ కలచివేసింది. లక్ష్మణ్ నాయక్ అందరితో నవ్వుతూ, కలిసిమెలిసి ఉంటూ.. అకస్మాత్తుగా దుర్మరణం చెందడం ఇటు రంగనాయకుల కాలనీలో, మామిడిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటన పట్ల మాజీ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు.

విద్యుత్ శాఖ ఆఫీస్ ముందు లక్ష్మణ్ నాయక్ మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు

కుటుంబసభ్యులు బంధుమిత్రులతో కలిసి తుక్కుగూడలో ఉన్న విద్యుత్ శాఖ ఆఫీస్ ముందు లక్ష్మణ్ నాయక్ మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న పహాడీషరీఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ , ఎస్సైలు దయాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సంఘటన స్థలానికి చేరుకున్నారు. మాజీ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్, మాజీ కౌన్సిలర్ వేణు గౌడ్, మాజీ ఎంపీటీసీ జంగయ్య ఇతర నాయకులు విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపి పోలీసుల సహాయంతో మృతుని కుటుంబానికి రూ. 14 లక్షల నష్ట పరిహారంగా మృతుని కుటుంబ సభ్యులలో ఎవరికైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చేటట్టుగా ఒప్పించారు. అంత్యక్రియల ఖర్చుగా రూ.1 లక్ష కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. . ఈ విషయాన్ని మాజీ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితారెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రెడ్డి కుటుంబ సభ్యులకు విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని యాతం పవన్ కుమార్ యాదవ్ తెలిపారు.