prathighatana.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 1:29 pm Digital Edition : PRATHI GHATANA

యదేచ్ఛగా అక్రమ ఇసుక రవాణ

మామూళ్ల మత్తులో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు

అక్రమ ఇసుక రవాణ చేస్తే కఠిన చర్యలు

ట్రాక్టర్లను సీజ్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేస్తాం -ధరూర్ మండల ఎస్సై నందికర్

ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణ యదేచ్చగా సాగుతుంది. రాయచూరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణను అడ్డుకోవాల్సిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. గద్వాల జిల్లా ధరూర్, కేటుదొడ్డి మండలాల పరిధిలో కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. వీరికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తోడవడంతో పట్టపగలే ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని కృష్ణా నది తీరాన ఉన్న బూడిదపాడు గ్రామాల నుంచి ధరూర్ కేటి దొడ్డి మండలాల్లోని పలు గ్రామాలకు అక్రమార్కులు అదును చూసి ఇష్టారాజ్యంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ ఇసుక వ్యాపారాన్ని వెలుగులోకి తెచ్చిన స్థానిక జర్నలిస్టులపై ఫోన్ ద్వారా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓ స్థానిక విలేఖరికి అక్రమ ఇసుక వ్యాపారి ఫోన్ ద్వారా రాయలేని భాషలో బూతులు మాట్లాడుతూ నీ అంతు చూస్తానని.. నీ ఇంటికి వచ్చి దాడి చేస్తానంటూ బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి అక్రమార్కులపై కఠిన చర్య తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు -ఎస్సై నందికర్

ధరూర్ మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ధరూర్ మండల్ ఎస్సై నందికర్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తే ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు యజమానులపై పీడియాక్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణా దందా విషయం తన దృష్టికి వచ్చిందని అటువంటి వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.