కుంటి సాకులతో పైప్ లైన్లను దొంగిలించాలన్న ప్రతిపాదనలను ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులు విరమించుకోవాలి
ముందు బ్రిడ్జి నిర్మించాలి – తర్వాతే పైప్ లైన్లను తొలగించాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహా డిమాండ్

ప్రతిఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని బస్వాపురం ప్రాజెక్ట్ కాల్వపై వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహా డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని మబ్బు రాళ్ల కాడ ఉన్న కాలువ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కొండమడుగు నరసింహా మాట్లాడుతూ.. రైతులు, వృత్తిదారులు, గ్రామీణ వ్యవసాయ, గొర్ల, మేకల పెంపకం దారులు, పాడి రైతులు బస్వాపురం ప్రాజెక్టు కాల్వలో పైపులు వేసి మట్టి పోయడం వల్ల రాకపోకలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కానీ కాలువలో నుండి నీళ్లు సరిగా పోవడం లేద ని కుంటి సాకుతో బ్రిడ్జి నిర్మాణం చేయకుండానే పైపులను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ప్రభుత్వాధికారులు నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టకముందే పైపులను తొలగిస్తే గ్రామంలోని ప్రజలు అవతలి వైపు పోవడానికి అవకాశం ఉండదన్నారు. ముందుగా కాలువ లోపల ఉన్న పైపులను తొలగించకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు కాలువ దాటడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా కాలువలో ఉన్న పైపులను తొలగించాలన్న ప్రతిపాదనను స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అధికారులు విరమించుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రజలందరితో కలిసి కాలువను పూడ్చడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం చేపట్టినంక మరొక మాట మాట్లాడకుండా ప్రజా ప్రతినిధులు వ్యహరించాలని హితవు పలికారు ప్రజలను ఇబ్బందుల పాలు చేసే పనులను చేపడితే చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకొని కాల్వపైన బ్రిడ్జి నిర్మాణము చేపట్టాలని డిమాండ్ చేశారు. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని బస్వాపురం ప్రాజెక్ట్ కాల్వ వద్ద సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామ ప్రజలు, గ్రామ ప్రజా ప్రతినిధులు నిరసన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహా, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహా, గ్రామ సర్పంచ్ రాంపల్లి కృష్ణ, మాజీ సర్పంచ్ మాకొల్ల సత్యం, ఉప సర్పంచ్ అందె మల్లేశం, వార్డు మెంబర్లు జక్కుల మల్లేశం, కొండమడుగు అశోక్, గజ్జి కవితా కుమార్, సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండా అశోక్, సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, కాంగ్రెస్, బీ ఆర్ఎస్ నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు గోదాల వెంకటరెడ్డి, శెట్టి ఐలయ్య, కొండ పాండు, ఎంకర్ల పాండు, వీరేశం, రాజు, నరేష్, కొండమడుగు పోశయ్య, జహంగీర్, ఎడ్ల కిష్టయ్య, ఏశమైన నరసమ్మ, కూకుట్ల మల్లమ్మ, ఎడ్ల స్వరూప, కర్రే లక్ష్మి, కొండ మహేశ్వరి, నవ్య, రాగుల లక్ష్మి, పసుల కావ్య, ఏశమైన మంజుల తదితరులు పాల్గొన్నారు.
