మహిళలు ఉద్యమాలకు సిద్ధం కావాలి
సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ పిలుపు
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్
మహిళల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ మహిళలకు అండగా ఉంటూ ముందుండి పోరాడుతుంది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అని, సమస్యల పరిష్కారానికి మహిళలందరూ ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డి గూడెం గ్రామంలో ఐద్వా గ్రామ మహాసభ కొండ హైమావతి అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనురాధ పాల్గొని మాట్లాడుతూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 1981 సంవత్సరంలో మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం, హింసకు వ్యతిరేకంగా ఏర్పడి మహిళల హక్కుల పైన పోరాడి అనేక విజయాలు సాధించిందని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కోసం, విద్య కూడా మహిళలకు అందించాలని, బాల్య వివాహాలు నిషేధించాలని, పురుషులతో పాటు స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలని, వరకట్నం వేధింపుల నిరోధక చట్టం ఉండాలని, గృహహింస నిరోధక చట్టం ఉండాలని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉండాలని, మహిళా కమిషన్లు ఏర్పాటు చేయాలని పోరాడి ఐద్వా విజయం సాధించింది అన్నారు. మహిళల సమస్యలే సంఘం సమస్యలుగా భావించి వారి తరఫున నిరంతరం పోరాడుతున్నది ఐద్వా సంఘమని తెలిపారు. బిజెపి పాలనలో రోజురోజుకు మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతున్నాయని వీటికి వ్యతిరేకంగా మహిళలందరూ పోరాటాలకు, ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. ఐద్వా మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వము రోజురోజుకు ప్రజల పైన భారాలు మోపుతూ నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతూ పోవడం వల్ల పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో గ్యాస్ ధర పెద్ద ఎత్తున పెంచడం చాలా దారుణమని అన్నారు. ధరలు పెరగడం వల్ల ప్రధానంగా మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధర, నిత్యవసర వస్తువుల ధరను తగ్గించాలని వారు డిమాండ్ చేసినారు. అనంతరం 16 మందితో నూతన ఐద్వా గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా ఎడ్ల జ్యోతి, కార్యదర్శిగా కొండ హైమావతి, కోశాధికారిగా కొండమడుగు కావ్య, ఉపాధ్యక్షురాలుగా కొండమడుగు లక్ష్మీ, పిన్నింటి హేమలత, సహాయ కార్యదర్శులుగా మెరుగు మహేశ్వరి, బొల్లెపల్లి భాను కమిటీ సభ్యులుగా ఎడ్ల రామలీల, కొండ సుజాత, ఆకారం తులసమ్మ, కొండమడుగు మమత, కొండ మంగమ్మ, బొజ్జ లక్ష్మి, బబ్బురి ఉపేంద్ర, మెరుగు సుశీల, బొజ్జ అలివేలు ఎన్నికైనారు.