prathighatana.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 11:40 am Digital Edition : PRATHI GHATANA

మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి

ఐద్వా మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి డిమాండ్

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్

అధికారంలోకి వస్తే మహిళలకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించి వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున పాటు పడతామని చెప్పి హామీలు ఇచ్చి గెలిచి రెండు ఏళ్లు గడిచిపోయిన ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) భువనగిరి మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి విమర్శించారు. ఆదివారం ఐద్వా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఒక్కరోజు సభ్యత్వ కార్యక్రమాన్ని భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెం గ్రామంలో ఇంటింటికి ఐద్వా నాయకత్వంతో కలిసి సభ్యత్వం చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ కానుక పేరుతో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని, మహాలక్ష్మి కింద నెల నెల మహిళలకు రూ.2500 ఇస్తామని, విద్యార్థినీలకు స్కూటీలు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు పింఛన్ పెంపు వంటి హామీలేవి అమలు చేయకుండా మొండి చెయ్యి చూపిస్తున్నదని మండిపడ్డారు. డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని నేటికీ ఇవ్వడం లేదని, గ్యాస్ సబ్సిడీ కూడా అందడం లేదని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా అమలు చేయలేదని కేవలం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా ఏది అమలు చేయడం లేదని ఈ ఆర్టీసీ బస్సు కూడా అన్ని గ్రామాలకు రావడం లేదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని విమర్శించారు. నాటి మనువాద సిద్ధాంతాన్ని మళ్లీ తీసుకొచ్చి మహిళలను వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచనలను చేస్తున్నదని అన్నారు. ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు కోసం మహిళలు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల సహాయ కార్యదర్శి కొండ హైమావతి, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షురాలు కూకుట్ల చొక్కాకుమారి, గ్రామానికి సంబంధించిన కొండ శోభారాణి, రాంపల్లి కృష్ణవేణి, రాంపల్లి కలమ్మ, ఎడ్ల జ్యోతి, ఎడ్ల పుష్ప, ఎడ్ల సునీత, ఆకారం తులసమ్మ, బొజ్జ హేమలత, మెరుగు సుశీల, మెరుగు మహేశ్వరి, గౌటి మంజుల తదితరులు పాల్గొన్నారు.