మహనీయుల ఆశయాలను గౌరవిస్తూ జయంతులను ఘనంగా ప్రభుత్వం నిర్వహించాలి
ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయులైన మహనీయుల జయంతులను ఘనంగా ప్రభుత్వం నిర్వహించాలని లెజెండ్రీ ప్రొడక్షన్ ఫోర్స్ అధ్యక్షులు బాలకృష్ణ, జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్, వెంకయ్య, వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త మాదరి రమేష్, జాయింట్ సెక్రెటరీ గోపిరెడ్డి సాయి అన్నారు. బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని 60 వ డివిజన్ కమలా నగర్, దాసరి నారాయణరావు కాలనీ రోడ్ వద్ద ఉన్న మహనీయుల విగ్రహాల నిర్వహణ రాబోయే జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై శంషాబాద్ జోనల్ కమిషనర్‌కు, అధికారులకు వారు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు వచ్చే నెల ఏప్రిల్ నెలలో జరగనున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విగ్రహాలకు రంగులు వేయడం, విద్యుత్ దీపాల ఏర్పాటు, పరిసరాలను శుభ్రం చేయాలని కోరారు. విగ్రహాల వద్ద రంగులు వేసి, విద్యుత్దీ పాలతోఅలంకరించాలన్నారు.
వేసవి దృష్ట్యా ఉత్సవాలకు వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. గతంలో మీర్ పెట్ కార్పొరేషన్ ద్వారా ఈ ఏర్పాట్లు జరిగేవని, ఈ ఏడాది కూడా జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. మహనీయుల ఆశయాలను గౌరవిస్తూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
