జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్
భువనగిరి మండల పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి పునరావాసం, పునర్వ్యవస్థీకరణ (ఆర్ అండ్ ఆర్) ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న బీ.ఎన్. తిమ్మాపురం, లప్పానాయక్ తండా లే అవుట్‌లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి తో కలసి మంగళవారం పర్యవేక్షించారు. లే అవుట్‌లో కొనసాగుతున్న, పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, ఇంకా ప్రారంభించాల్సిన పనులను తక్షణమే మొదలు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలను త్వరితగతిన అందించాలని సూచించారు.
ప్రభుత్వ భవనాల నిర్మాణంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు, వాటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీలోకి వెళ్లే మట్టి రహదారులను చదును చేసి, రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చుడాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండలం తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్‌తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.