యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతిఘటన బ్యూరో జంగిటి రవీందర్

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్ల పక్షం శిశిర ఋతువు నవమి బుధవారం కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో పాదపద్మార్చన సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. లోక కళ్యాణం కోసం శ్రీ సుదర్శన నారసింహ హవనం, అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.
ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.
