💥 అధికారుల ఫోటోలు పెట్టి వార్తలు రాయడం తప్పా..?
💥 జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తే ఎలా..?
💥 మీడియా స్వేచ్ఛను హరిస్తున్న పట్టించుకోకపోతే ఎలా..?
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను “ఫోర్త్ ఎస్టేట్” గా పేర్కొంటున్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, అధికారుల పనితీరును ప్రశ్నించడం, ప్రజా ప్రతినిధుల బాధ్యతను గుర్తుచేయడం, ప్రజల పక్షాన నిలబడడం.. ఇవి జర్నలిజం ప్రధాన లక్ష్యాలు. అయితే ఇటీవల కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు వాళ్ల అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి వార్తలను అడ్డుకోవడానికి, రిపోర్టర్లను బెదిరించడానికి ప్రయత్నిస్తున్న ఘటనలు చాలా పెరుగుతున్నాయి.
అధికారుల, ప్రజాప్రతినిధుల ఫోటోలు పెట్టి వార్త రాయడం తప్పా..?
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రజల పన్నులతో జీతాలు పొందుతూ, ప్రజాసేవ చేయడానికి నియమితులవుతారు. అందువల్ల వారు ప్రజా బాధ్యత కింద వస్తారు. వారి పనితీరులో లోపాలు, అవినీతి, అక్రమాలు, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం ఉన్నప్పుడు వారి ఫోటోలతో సహా వార్తలు ప్రచురించడం జర్నలిజంలో సహజం, చట్టబద్ధం కూడా.. అలా రాయడం వల్ల జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, చర్యలు తీసుకునే అధికారం అధికారులకు కూడా ఉండదు. వాళ్లు కేవలం వార్తపై వివరణ ఇవ్వాలి అంతే. అధికారిక విధుల్లో ఉన్న వ్యక్తులపై విమర్శలు చేయడం, ప్రజా ప్రయోజనాల కోసం సమాచారాన్ని ప్రచారం చేయడం, ఫోటోలు ప్రచురించడం (పబ్లిక్ డొమైన్లో ఉన్నవి) ఇవి సాధారణంగా చట్ట విరుద్ధం కావు. అయితే వార్త వాస్తవమైన ఆధారాలతో ఉండాలి.
కేసులు పెట్టే హక్కు ఎవరికుంది..?
ఎవరైనా వ్యక్తి తన ప్రతిష్ట దెబ్బతిన్నదని భావిస్తే, వారు చట్టపరమైన మార్గంలో డిఫమేషన్ (నిందారోపణ) కేసు పెట్టవచ్చు. కానీ కేవలం వార్త రాసినందుకు లేదా ఫోటో పెట్టినందుకు పోలీస్ కేసులు పెట్టడం సాధారణంగా సరైంది కాదు. ప్రత్యేకంగా అది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన వార్త అయితే అసలు కేసు చెల్లెదు. జర్నలిస్టులపై కేసులు పెట్టే ముందు పోలీసులు కూడా చట్టపరమైన పరిమితుల్లోనే వ్యవహరించాలి. జర్నలిస్టులను బెదిరించడం, వేధించడం ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం.
వివరణ తీసుకోవడం అవసరమా..?
ప్రొఫెషనల్ జర్నలిజంలో “వర్షన్ తీసుకోవడం” ఒక నైతిక బాధ్యత, అధికారిని సంప్రదించడం వారి స్పందన తీసుకోవడం, స్పందన రాకపోతే సంప్రదించాం, స్పందించలేదు అని పేర్కొనడం.. ఇది వార్త విశ్వసనీయతను పెంచుతుంది. అయితే స్పందన రాకపోయినా, అధికారి వివరణ లేకపోయినా ప్రజా ప్రయోజన అంశం అయితే కథనం ప్రచురించడం తప్పు కాదు.
బెదిరింపులు చేయడం తప్పు..
రిపోర్టర్లను బెదిరించడం ప్రజాస్వామ్యానికి ముప్పు
కొంతమంది అధికారులు, నాయకులు ఫోటో ఎందుకు పెట్టారు.? నాపై వార్త ఎందుకు రాశారు.? అంటూ రిపోర్టర్లను బెదిరించడం పెరుగుతోంది. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, మీడియా స్వేచ్ఛపై దాడి, అది సమాచార హక్కుపై దాడిగా భావించాలి. నిజమైన సమాచారం ప్రచురించే హక్కు రిపోర్టర్లకు ఉంది. ప్రజా ప్రయోజన అంశాలను వెలుగులోకి తీసుకురావడం
బెదిరింపులకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకొని పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయించాలి. అవసరమైతే జర్నలిస్టులు కూడా కోర్టును ఆశ్రయించి తమ హక్కులను రక్షించుకోవాలి.
జర్నలిస్ట్ అంటే కేవలం నిజం రాయడమే..
జర్నలిజం అంటే ఎవరికైనా నచ్చే వార్తలు రాయడం కాదు, నిజం రాయడం. ప్రజల సమస్యలు, అవినీతి, అక్రమాలు వెలుగులోకి తేవడమే నిజమైన జర్నలిజం. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థలను ప్రశ్నించడం జర్నలిస్టుల బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించినందుకు కేసులు, బెదిరింపులు వస్తే, అది ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే హెచ్చరిక. “నిజం రాసే కలం ఎప్పుడూ భయపడదు, భయపడాల్సింది తప్పు చేసే వారే.
ప్రతిఘటన రాజు
సీఈఓ & చీఫ్ ఎడిటర్, ప్రతిఘటన తెలుగు దినపత్రిక
