ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో దోచుకున్న, దాచుకున్న రూ. 122 కోట్ల ప్రజల సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లే వరకు పోరాటం చేస్తామని అవినీతికి పాల్పడిన ఏ ఒక్క రాజకీయ నాయకుడిని వదిలిపెట్టమని బడంగ్పేట్ బీజేపీ క్లస్టర్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, నాయకులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి , సూర కర్ణారెడ్డి, నడుకుడి యాదగిరి పలువురు బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.
శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ సర్కిల్లో వెలుగులోకి వచ్చిన రూ. 122 కోట్ల భారీ అవినీతి కుంభకోణం జరిగి డిప్యూటీ కమిషనర్‌తో పాటు 10 మంది అధికారులు సస్పెండైన విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. నాదర్ గూల్ లో బీజేపి పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ సర్కిల్లో వెలుగులోకి వచ్చిన రూ. 122 కోట్ల భారీ అవినీతి కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. డిప్యూటీ కమిషనర్‌తో పాటు 10 మంది అధికారులు సస్పెండ్ కావడం ఈ అవినీతి ఎంత విస్తృతంగా జరిగిందో స్పష్టంగా చూపిస్తోందని అన్నారు. బినామీ కాంట్రాక్టర్ అనకొండ లాంటి వ్యక్తి పన్నాల రాజేందర్‌రెడ్డి కి రూ.1600 కోట్ల అభివృద్ధి పనులు అప్పజెప్పారన్నారు ఎవడబ్బ సొమ్మని అతని ఒక్కనికే అప్పజెప్పారని ప్రశ్నించారు. దోషులు బయట పడతారనే భయంతో బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా బడంగ్పేట్ నగర పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ దాకా అవినీతి నిరాటంకంగా కొనసాగుతూనే ఉందని, ఈ దోపిడీపై మొదటి నుంచి బీజేపీనే పోరాటం చేస్తోందని తెలిపారు. ఇకపై ఈ పోరాటం మరింత తీవ్రంగా ఉంటుందని, అవినీతి చేసిన ఏ ఒక్క అధికారిని, నాయకులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఇటీవల విలేకరుల సమావేశంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి జరగలేదని బీజేపీ నాయకులు తనపై లేనిపోని బురద జల్లుతున్నారని కంటతడి పెట్టారు అన్నారు. బీజేపీ నాయకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ.. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కంటతడి పెట్టినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందా అని ప్రశ్నించారు. మరి అవినీతి జరగకపోతే 10 మంది అధికారులు ఎందుకు సస్పెండ్ అవుతారు. గతంలో బాలాపూర్ ప్రభుత్వ స్కూల్లో పాత గోడలకు 2 దర్వాజాలు 4 కిటికీలు వేయించిరూ. 40 లక్షల బిల్లులు పెట్టారన్నారు. స్కూల్లో చదువుతున్న ఆడపిల్లలకి బాత్రూం లేక ఇబ్బందులు పడితే బాత్రూం ఏర్పాటు చేయలేకపోయారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకి అన్నగా అండగా నిలబడ్డాను అన్నారు. తాను ప్రశ్నించడం వలన బాత్రూంలు ఏర్పాటు చేశారని తెలిపారు ఆడపిల్లలకి సమస్య తీరిందన్నారు. ఈ అవినీతి కుంభకోణంపై కూడా బీజేపీ దోషులకు శిక్ష పడే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.
