తెలంగాణ రైతు సంఘం డిమాండ్
ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్
పాలు ఉత్పత్తి చేసే పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు ఏ వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహా డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీరెల్లి రూట్లో పాల ఉత్పత్తిదారుల రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలు ఉత్పత్తి చేసే పాడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విజయ డైరీ ద్వారా ప్రభుత్వమే పాడి రైతుల నుండి పాలను సేకరించాలని, వారానికోసారి నగదును రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి పాలను దిగుమతి చేసుకోవడం ద్వారా, అప్పులు చేసి డైరీలను నిర్వహిస్తున్న స్థానిక పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలు ఉత్పత్తి చేసే పాడి రైతులకు ప్రభుత్వం ఉచిత దానాను సరఫరా చేయాలని, పాల ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన ఆవులు, గేదెలను ప్రభుత్వమే సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలను అందించి ప్రోత్సాహం అందించాలని డిమాండ్ చేశారు. పాడి రైతులను ప్రోత్సహించడం ద్వారా పాల ఉత్పత్తి పెరిగి, నిరుద్యోగం తగ్గి పాల కల్తీని కూడా నిరోధించడానికి అవకాశం ఉంటుందన్నారు. అనంతరం 17 మందితో జోగులాంబ గద్వాల జిల్లా పాల ఉత్పత్తిదారుల (సొసైటీ) సంఘం ఏర్పాటు చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఏ వెంకటస్వామి, అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పెద్ద పరుషరాముడు, కోశాధికారిగా రఘు, ఉపాధ్యక్షులుగా గడ్డం శీను, బోజేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా వీరేష్, నీలం నరసింహ, ప్రచార కార్యదర్శులుగా పాల నరేష్, వీరేష్ యాదవ్, సలహాదారులుగా రవీందర్ నాయుడు, సుధాకర్, కమిటీ సభ్యులుగా చెన్నారెడ్డి, లక్ష్మన్న, పరుశరాముడు, మహబూబ్, సందీప్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ.. పాడి రైతులంతా సంఘటితంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఐక్య పోరాటాల ద్వారా పాడి రైతులు తమ హక్కులు సాధించుకో గలరని అన్నారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు ఎన్. శ్రీధర్, రంగస్వామి, రామకృష్ణ, శ్రీహరి, నర్సింహ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
