గ్యాస్ బండ కటౌట్లతో వినూత్న రీతిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన
పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి

ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి :
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ ఆడుతున్న దొంగ నాటకాలకు వ్యతిరేకంగా సోమవారం ఎల్బీనగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చెబుతోంది గ్యాస్ కొరత లేదు – రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది సప్లై లేదు.. అనే గ్యాస్ బండ కటౌట్లతో వినూత్న రీతిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, జక్కిడి రఘువీరారెడ్డి లు పాల్గొని వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం “గ్యాస్ సప్లై ఎక్కడా ఆగలేదు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి” అని పేర్కొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం “కేంద్రం నుంచి సరైన సరఫరా లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి” అని చెబుతుందని ఈ రెండు పార్టీలు దొంగ నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ రెండు ప్రభుత్వాల పరస్పర ఆరోపణల మధ్యలో సామాన్య ప్రజలు, రోజువారీ జీవనంపై ఆధారపడే ఆటో డ్రైవర్లు, టిఫిన్ సెంటర్ యజమానులు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ వంటి అనేక వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ కొరతను రాష్ట్ర ప్రభుత్వమే సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి అన్నారు. ఇదే నిజమైతే ఇది పూర్తిగా అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ నాయకులు ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని, ఇకనైనా మారి ప్రజా సమస్యలు పరిష్కరించే పని చెయ్యాలని వారిని హెచ్చరించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరఫరా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, బాధ్యత వహించడం ప్రభుత్వాల కర్తవ్యమని, వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, ఉద్యమకారులు, పలు విభాగాల కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.