సాగు చేసుకుంటున్న.. రైతులను కాదని బడా కంపెనీలకు కట్టబెట్టిన గత ప్రభుత్వ పెద్దలు
7 వేల కోట్ల విలువైన సర్కారు భూముల్లో చొరపడ్డ నేటి ప్రభుత్వ పాలకవర్గ బడా నేతలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
సీలింగ్ యాక్ట్ ను పక్కన పెట్టి దొంగ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు
దొంగ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి
గత ప్రభుత్వ రెవెన్యూ మంత్రిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి
నాదర్ గుల్ ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులకే ఇవ్వాలి
లేదంటే రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆ.. భూములను తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంచాలి
టీజేఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దార సత్యం డిమాండ్
ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్ గుల్ గ్రామ రెవెన్యూ పాత సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నెంబర్ 119) లోని 373.22 ఎకరాల సర్కార్ భూమిపై రాజకీయ రచ్చ నడుస్తున్నదని.. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దార సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…అక్కడి రైతులు గత 40 ఏళ్లుగా ఆ భూమినే నమ్ముకొని బతుకుతున్నారని తెలిపారు. నాదర్ గుల్ భూములు తనవేనని శివరాజ్ బహుదూర్ అనే వ్యక్తి చెప్పినా..2005 లో కందుకూరు ఆర్డీవో ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారని చెప్పారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఏఐసీసీకి అప్పగించారని గుర్తు చేశారు. 2017 లో హైకోర్టు కూడా అవి ప్రభుత్వ భూములేనని తీర్పునిచ్చిందని వెల్లడించారు. సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాల భూమి ఉండే అవకాశం లేదన్నారు. అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గంలోని పెద్దల అండదండలతో శివరాజ్ బహదూర్ 2016 లోనే ఆ భూములను ఆల్ఫా, ఒమేగా, యూనిటెక్ అనే కంపెనీలకు విక్రయించారని తెలిపారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధంగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల ప్రోద్బలంతోనే జరిగిందని గుర్తు చేశారు. చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 17 ప్రకారం సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా భూములను అమ్మే హక్కు లేదన్నారు. అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అప్పట్లో 2017 లోనే హైకోర్టు కూడా ఆదేశించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం భూ భారతిలో కూడా సెక్షన్ 22 ప్రకారం నిషేధిత జాబితాలో అది ప్రభుత్వ భూమిగా ప్రొహిబిటెడ్ ల్యాండ్ గానే చూపిస్తోందని వివరించారు.
రంగులు మారిన, మారని రెండు పార్టీల నేతలే.. ఊసరవెల్లులు..!
నాదర్ గుల్ భూ కుంభకోణం వెనక ఉన్నది ప్రస్తుతం అధికార పక్షంలో కొనసాగుతున్న పెద్దలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పిన నేతలే.. అని తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దారా సత్యం ఆరోపించారు. ఇప్పుడు ఈ భూముల కుంభకోణాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పెద్దలు కూడా అప్పట్లో వాటాదారులే అని విమర్శించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సాగు చేసుకుంటున్నా రైతుల నోట్లో మట్టి కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఊసరవెల్లులని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాదర్ గుల్ భూముల విషయంలో జోక్యం చేసుకొని, సాగు చేసుకుంటున్న పేద రైతులకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే సీఎం ఈ భూములపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వయిరీ మొదలుపెట్టి గత ప్రభుత్వంలోని రెవెన్యూ మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బోగస్ కంపెనీలపై కేసులు నమోదు చేసి ఆయా యజమానులను రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు. నాదర్ గుల్ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్న రైతులకు కేటాయించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1200 మందికి పైగా అమరవీరుల కుటుంబాలకు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఒక్కో కుటుంబానికి 250 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించాలని దారా సత్యం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో 600 మంది రైతు కుటుంబాలతో తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
