అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ప్రభుత్వాలు మారినా పోలీసుల సేవల్లో మార్పు ఉండదని, వారు ధైర్యంగా, ప్రశాంతంగా విధులు నిర్వర్తించాలంటే న్యాయమైన ప్రమోషన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభలో జరిగిన హోం శాఖ పద్దులపై చర్చలో పాల్గొన్న మహేశ్వరం ఎమ్మెల్యే పీ. సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర పోలీసుల సేవలను అభినందిస్తూనే, వారి పదోన్నతులకు సంబంధించిన ఒక కీలకమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో 24 గంటల పాటు శాంతి భద్రతల పరిరక్షణలో శ్రమిస్తున్న పోలీస్ శాఖ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని, వారి సేవలకు ఏ చిన్న ఆటంకం లేకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. 2009 బ్యాచ్ ఎస్సై ల ప్రమోషన్ల వ్యవహారం రాష్ట్రంలోని రెండు మల్టీ జోన్లలో (జోన్ 1, జోన్ 2) 2009 ఎస్సై బ్యాచ్ కు చెందిన వారిలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపు 250 నుంచి 300 మందికి సీఐ లుగా ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. మిగిలిపోయిన 60-70 మంది ఆ ప్రమోషన్ల ప్రక్రియలో, అదే 2009 బ్యాచ్ కు చెందిన మరో 60-70 మంది అధికారులకు సీఐలు గా ప్రమోషన్ రాక ఇప్పటికీ ఎస్సైలు గానే ఉండి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితమే సీఐ లైన వారి బ్యాచ్ మేట్స్ ఇప్పుడు డీఎస్పీ ప్రమోషన్లకు సిద్ధంగా ఉన్నారని, ఇది తీవ్రమైన అసమానతలకు దారి తీస్తోందన్నారు. ఒకే బ్యాచ్ కు ఎంపికైనప్పటికీ, ప్రమోషన్లు రాని వారు (ఎస్సైలు), తమ తోటి బ్యాచ్ మేట్స్ (సీఐలు) కు సెల్యూట్ చేయాల్సిన ఇబ్బందికర, అసౌకర్య వాతావరణం నెలకొందని సభ దృష్టికి తెచ్చారు. ఈ 60-70 మంది ఎస్సైలకు ప్రస్తుతం ఖాళీలు లేకపోతే, ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైతే ‘సూపర్ న్యూమరరీ’ పోస్టులైనా సృష్టించి వారికి న్యాయంగా రావాల్సిన సీఐ ప్రమోషన్లను కల్పించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హోం గార్డులను పర్మినెంట్ చేస్తామని, వారికి పెన్షన్, హెల్త్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదని, వెంటనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.