నేషనల్ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ డైరెక్టర్ ని కలిసిన ప్రిన్సిపల్ మదన్ మోహన్
జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో ఎంఓయూ ఒప్పందం
ప్రతిఘటన,నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్.జీ.సీ) తెలంగాణ డైరెక్టర్ డబ్ల్యూ.జీ. ప్రసన్న కుమార్‌ను కలిసి భేటీ అయినట్లు నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల (నోడల్ డిగ్రీ కళాశాల) ప్రిన్సిపల్ మదన్ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నేషనల్ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ శాఖతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, పచ్చదనం ప్రోత్సాహం, స్వచ్ఛత కార్యక్రమాలు, వృక్షారోహణ వంటి కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా కళాశాలల్లో గ్రీన్ క్లబ్ కార్యకలాపాలు మరింత చురుకుగా కొనసాగడంతో పాటు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ప్రాయోగిక శిక్షణ అందే అవకాశం ఉంటుందని ప్రిన్సిపల్ మదన్ మోహన్ పేర్కొన్నారు. అదనంగా, నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడే రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఈ చర్యల ద్వారా యువతలో పర్యావరణంపై బాధ్యతాభావం పెంపొందించి, సమాజంలో పచ్చదనం పరిరక్షణకు తోడ్పడేలా ప్రోత్సహించడమే లక్ష్యమని ఆయన వివరించారు.
