జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్
జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో ఇసుక సరఫరా, వినియోగం, నిల్వలు, రవాణా తదితర అంశాలపై ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి మైన్స్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం అవసరమైన ఇసుకను పూర్తి గా ఆన్ లైన్ విధానంలోనే చేసుకొని పొందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే, ఆన్ లైన్ లో బుకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఇసుక నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రవికుమార్, ఇరిగేషన్ యస్.ఈ రవీందర్, జిల్లా రవాణా అధికారి హరికృష్ణా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.