prathighatana.com
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 12:48 pm Digital Edition : PRATHI GHATANA

ఘనంగా రంజాన్ వేడుకలు

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు (రోజా) ముగించుకుని శుక్రవారం చంద్ర దర్శనంతో ముస్లిం సోదరులు శనివారం పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు వేల సంఖ్యలో చేరి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని పహాడిషరీఫ్, షాహీనగర్, మహేశ్వరం కందుకూరు, బాలాపూర్ , సరూర్ నగర్ మండలాల పరిధిలో తెల్లవారుజామున నుంచే కొత్త దుస్తులు ధరించి, సుగంధ ద్రవ్యాలు అద్దుకుని అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ “ఈద్ ముబారక్” చెప్పు కుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు ఈ వేడుకల్లో పాలుపంచుకుంటూ గంగా-జమునా తెహజీబ్ (మత సామరస్యం) చాటుతున్నారు. స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి శీర్ ఖుర్మా వంటి తీపి వంటకాలను ఆస్వాదిస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. కేవలం విందు వినోదాలే కాకుండా, పేదవారికి చేసే ‘జకాత్’ (దానం) ద్వారా మానవత్వాన్ని కూడా ఈ పండుగ ప్రతిబింబిస్తోందని స్థానిక నాయకులు షేక్ అఫ్జల్, షేక్ జహంగీర్, నయూమ్, యూసుఫ్ పటేల్, షర్ఫుద్దీన్ హామెద్, శంషోద్దీన్, హుస్సేన్ , సమీర్, ఆదిల్ తదితరులు తెలిపారు.

ప్రశాంతంగా ముగిసిన రంజాన్ వేడుకలు

మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్, పహాడీషరీఫ్ ప్రాంతాల్లో పూర్తిగా ముస్లింలు నివాసం ఉంటారు. కొన్ని ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈద్గాల, ప్రార్థనా స్థలాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు, మున్సిపల్ అధికారులు సిబ్బంది గత పది రోజుల నుంచి ఈద్గాల వద్ద ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదరులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. డీసీపీ రాజేష్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, పహాడీషరీఫ్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ రెడ్డి , సుధాకర్ ఈద్గాల వద్ద బందోబస్తు ను పర్యవేక్షించారు. రంజాన్ వేడుకలు ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా శాంతి యుతంగా రంజాన్ వేడుకలు ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.