పచ్చని తివాచీలా మారిన హయత్ నగర్ కుమ్మరి కుంట
చెరువు వద్ద చెత్త చెదారంతో.. కంపు.. కంపు..!
దుర్వాసనతో విజృంభిస్తున్న దోమలు, క్రిమి కీటకాలు
విష జ్వరాల భారిన స్థానిక ప్రజలు
చోద్యం చూస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు

ప్రతిఘటన, ఎల్బీనగర్ ప్రతినిధి
అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో హయత్ నగర్ కుమ్మరి కుంట గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయి ప్రజలకు శాపంగా మారింది. గుర్రపు డెక్క కారణంగా చెరువు పరిసరాలన్నీ దుర్గంధంగా మారుతున్నాయి. దీనికి తోడు చెత్తా చెదారం వేయడంతో దోమలు, క్రిమి కీటకాలు విజృంభిస్తున్నాయి. విష జ్వరాలు వ్యాపిస్తుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చెరువు పరిసరాలన్నీ కంపు.. కంపు
హయత్ నగర్ కుమ్మరి కుంట చెరువు గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయింది. దీనికి తోడు చెత్తా చెదారాన్ని చెరువులో పడ వేయడంతో అది ఒడ్డుకు చేరి దుర్వాసన వెదజల్లుతుంది. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించాల్సిన జీహెచ్ఎంసీ శానిటేషన్ అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చెరువు పరిసరాలన్నీ కంపు కొడుతున్నాయని వాపోతున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు ప్రజా ప్రతినిధులు
గుర్రపు డెక్క వల్ల దోమలు పెరిగి మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విష వ్యాధులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నీళ్లను చెరువులోకి వదులుతుండడంతో కుమ్మరి కుంట పూర్తిగా దుర్గంధ పూరితంగా మారింది. దీంతో ఈగలు, దోమలకు ఆవాసంగా మారి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. అసలే సీజన్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ దోమలు కుట్టడంతో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్న సంబంధిత అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నీరు చెరువుల్లోకి వదలడంతో గుర్రపు డెక్క పెరుగుతోంది. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు ఎక్కడ పోయారని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే అధికారులు గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు కుమ్మరి కుంట పరిసర ప్రాంతాలలో ఉన్న చెత్త చెదారాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.