భూ కబ్జాలకు పాల్పడిన లేదా ప్రభుత్వం తీసుకోవాలని చూసిన చూస్తూ ఊరుకునేది లేదు
తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు రాత్లావత్ శంకర్ నాయక్ డిమాండ్

ప్రతిఘటన, ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇల్లు కూల్చివేసిన ప్రాంతాన్ని తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు రాత్లావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో వారి బృందం సందర్శించింది. వెలుగుమట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను ప్రభుత్వం తొలగించడంతో గుడిసెవాసుల ప్రాంతాన్ని బృందం పరిశీలించి గుడిసెవాసులను పరామర్శించారు. గుడిసె వాసులందరూ ఆవేదనతో తమ సమస్యలు పరిష్కరించాలని సర్వోదయ మండలి నేతలకు తమ గోడును విన్నవించారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు రాత్లావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఖమ్మం వెలుగుమట్లలో 28 ఎకరాల భూదాన భూమిలో దాదాపుగా వెయ్యి గుడిసెలు వేసుకున్న పేదల గుడిసెలను ప్రభుత్వం అన్యాయంగా తొలగించడం సరైనది కాదన్నారు. గాంధీజీ వినోబాభావే ఆలోచనలకు విరుద్ధమని భూదాన భూములన్ని కూడా భూమి లేని నిరుపేదలకు దక్కాలని కోరుకున్నారని అందులో భాగంగానే ఖమ్మం వెలుగుమట్లలో భూదాన భూముల్లో గుడిసెలు వేసుకొని ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం వెంటనే అదే స్థలంలో పట్టాలి ఇచ్చి వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూదాన భూముల హద్దులను గుర్తించి కాపాడి వాటికి భూదాన బోర్డు ఏర్పాటు చేసి అవి పేదలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు వేసుకున్న స్థలంలోనే పట్టాలు మంజూరు చేయాలని కానీ అలా చేయకుండా కూడు లేని పేదలపై ప్రభుత్వం బుల్డోజర్లతో ఇండ్లను కూల్చడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. ఇలా చేయడం తగదని పేదల పక్షాన ప్రభుత్వం ఉండాలని లేని యెడల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అందుకు గుడిసె వాసులందరూ సిద్ధంగా ఉండాలని గుడిసెవాసులు ఎవరు అధైర్య పడవద్దు అని భూదాన భూముల్లో ఇండ్లు కోల్పోయిన స్థలంలోనే పట్టాలు వచ్చేంత వరకు, ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇచ్చేంత వరకు ఉద్యమించాలని శంకర్ నాయక్ పిలుపునిచ్చారు.