prathighatana.com
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 2:10 pm Digital Edition : PRATHI GHATANA

కుంటలు నాళాలు ఆక్రమించిన స్థలాల్లో నిర్మించిన కట్టడాలను కూల్చి వేయకుంటే – దగ్గరుండి మరీ కూల్చివేస్తాం -హైడ్రా కమిషనర్ రంగనాథ్

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ప్రభుత్వ భూముల్లో, కుంటలు నాళాల్లో కట్టడాలు వెలుస్తున్నాయి. ప్రభుత్వ భూమి, కుంటలు, నాళాలు కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూమి, శిఖం భూములను సైతం ఆక్రమించి నిర్మాణాన్ని చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. మామిడిపల్లి గ్రామం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉండడంతో భూమి లక్షల్లో పలుకుతుందని అక్రమార్కులు ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకొని కట్టడాలు చేస్తున్నారు. విలువైన భూమి స్థలాల్లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు నిలుస్తున్న సంబంధిత అధికారులు మాత్రం ఆ దిశగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు పలువురు ఆరోపించారు. ఇలా అయితే అక్రమ కట్టడాలు ఆగవని మామిడిపల్లి చెందిన బీజేపీ నాయకుడు మద్ది రాజశేఖర్ రెడ్డి, స్థానికులు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాద్ ని కలిశారు. నాలాలు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యలంలో నీటి పారుదల, రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి క్షేత్రస్థాయిలో వచ్చి ప్రభుత్వ భూముల్లో, నాలాల్లో కుంటల్లో వెలిసిన కట్టడాలను పరిశీలించారు. కుంటలు నాళాలు ఆక్రమించిన స్థలాల్లో నిర్మించిన కట్టడాలను కూల్చి వేసుకుంటే సరి… లేకపోతే దగ్గరుండి మరీ కూల్చి వేస్తామని హైడ్రా కమిషనర్ రంగ నాథ్ అక్రమ నిర్మాణాదారులను హెచ్చరించారు. అధికారులు రికార్డులో ఉన్న విస్తీర్ణం, ప్రస్తుతం ఉన్న విస్తీర్ణాన్ని పరిశీలించారు. ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ డీఈ నారాయణ, ఏఈ వంశీ, వర్క్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

రికార్డులో ఉన్న విస్తీర్ణం ఎంత అంతే ఉండాలి. కుంటలు నాలాలు ఆక్రమణ చేశారని తేలితే చర్యలు తప్పవు – హైడ్రా కమిషనర్ రంగనాథ్

రికార్డులో ఉన్న విస్తీర్ణం ఎంత అంతే ఉండాలి. ప్రభుత్వ భూముల్లో, కుంటలు, నాలాలను ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపట్టారని తెలితే చర్యలు తప్పవని అక్రమ దారులను హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాను. కుంటలు, నాలాలు కబ్జాలు గురైనట్లు గుర్తించాము. ఇరిగేషన్ అధికారులకి రికార్డులో ఎంత ఉంది. ప్రస్తుతం ఎంత ఉంది అనే వివరాలు 3 రోజుల్లో ఇవ్వాలని కోరాము. సమాచారం ఇచ్చిన వెంటనే మళ్ళీ వచ్చి ఎంతవరకు అయితే కబ్జా గురైందో వాటన్నింటిని ఆ కబ్జా చెర నుంచి విడిపిస్తాము. కట్టడాలు ఎన్ని ఉన్నా బుల్డోజర్లతో కూల్చివేస్తాం.

బాలాపూర్ ఎమ్మార్వో ఇందిరాదేవిని, డీ ఈ ఈ జగదీష్, ఏ ఈ గంగరాజును సస్పెండ్ చేయాలి

బీజేపీ నాయకులు మద్ది రాజశేఖర్ రెడ్డి

ఇరిగేషన్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన బాలాపూర్ మండల ఎమ్మార్వో ఇందిరాదేవి, డి ఈ ఈ జగదీష్, ఏ ఈ గంగరాజును లను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకుడు మద్ది రాజశేఖర్ రెడ్డి, మామిడిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. మామిడిపల్లి గ్రామంలో నాలాలను ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేస్తున్నారని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేస్తే బాలాపూర్ మండల అధికారులు, ఇరిగేషన్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఎటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మామిడిపల్లిలో ఎస్ ఆర్ ఆర్ ఏయిరోసిటీ ఎల్ఎల్పి పియోనిర్ బిల్డర్స్ రియల్ సంస్థ నాలా కబ్జా చేసి విల్లాల నిర్మాణం చేస్తున్నారు. ఉంగరోని కుంట చెరువు అలుగు నీరు బయటికి వెళ్లకుండా అలుగు ఎత్తు పెంచడంతో చుట్టుపక్కల రైతులకు ఇబ్బందిగా మారింది. కట్ట కింద ఎస్ ఎస్ ఆర్ అండ్ జిఎంఆర్ రెండు కంపెనీలకు ఎటువంటి అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మట్టి వేయడంతో రాబోయే ఆ రోజుల్లో చెరువు కట్ట తెగి పామిడిపల్లి గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది . శ్రీనిధి అండ్ ఫోనిక్స్ ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు నాళాలు ఉంగరోని కుంట నాలా కంకాయకుంట నాల ఈ రెండు నాలాలు కబ్జా చేసి విల్లాలు నిర్మాణం చేస్తే గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దరఖాస్తు ఇస్తే అవినీతి అధికారులతో కబ్జాదారులు అక్రమార్కులతో అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడడం దారుణమైన విషయం అన్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన చర్య తీసుకోలేదు. బాలాపూర్ ఎమ్మార్వో, అధికారులు ఇరిగేషన్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి అడ్డుకున్నారు. ఇక ఎమ్మార్వో తో కాదని అనుకొని తాము గ్రామస్తులు కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలవడం జరిగింది. స్పందించిన ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.