prathighatana.com
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 3:33 pm Digital Edition : PRATHI GHATANA

కాలాన్ని తెలుసుకొని మెలిగితే దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది

 

రామాలయంలో శాస్త్రోక్తంగా శ్రీ పరాభవ ఉగాది పంచాంగ శ్రవణం

రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గల సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గురువారం శ్రీ పరభవ నామ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. మానవుడు కాలాన్ని తెలుసుకొని మెలిగితే దైవానుగ్రహం ప్రాప్తిస్తుందని అన్నారు. ముఖ్యంగా తిథి, వార నక్షత్ర, యోగ కరణములు సవ్యంగా ఉన్న వారికి సంపద, ఆయుషు, పాప నివారణ, రోగాలు తగ్గడం, కార్యసిద్ధి ఏర్పడతాయని అన్నారు. కార్యసిద్ధి కొరకు పంచాంగం ఉపయోగపడుతుందని తెలిపారు. వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలంలో శుభకార్యాలు చేరాదని, కాలానికి అనుగుణంగా వెళ్లాలని అన్నారు. కలియుగం ప్రారంభమై 5127 సంవత్సరాలు అయిందన్నారు. ఈ సంవత్సరం రాజు గురువు ఉన్నాడని మంత్రి కుజుడు ఉన్నాడని సైన్యాధిపతి చంద్రుడు ఉన్నాడని అన్నారు. గురువు రాజు కావడంతో గురువుల యొక్క పాత్ర విశేషంగా పెరుగుతుందన్నారు. మే నెలలో 11 నుండి 29 వరకు కర్తరి ఉందని శుభకార్యాలు చేరాదన్నారు. 2027 జులై 15 నుండి ఆగస్టు 12 వరకు గురుమౌడ్యమి ఉన్నదన్నారు. జూన్ 2 నుండి 13 వరకు యమునా నది పుష్కరాలు వస్తాయని యమునా నది స్నానము మధురలో చేయడం శ్రేయస్కరమన్నారు. జనవరి 14,15,16 భోగి సంక్రాంతి కనుమ జరుపుకోవాలని అన్నారు. అధిపతి కేతువు ఉండడంతో గురువులతో తీర్థయాత్రలు అధికంగా ఉంటాయని అన్నారు. అన్నదాన సత్రాలు పెరుగుతాయని అన్నారు. దీపావళి ఆది, సోమ వారాలలో అమావాస్య తిథి ఉన్నందున సోమవతి అమావాస్య రోజు జరుపుకోవడం శ్రేయస్కరం అన్నారు. శివ దర్శనాలు, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయాలన్నారు. మీన రాశి నుండి మేష రాశి వరకు రాశి ఫలితాలు ఆదాయ, వ్యయ ఫలితాలను తెలిపారు. రైతులకు రెండు పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. గురువుల యొక్క విశిష్టత ప్రాధాన్యత విశేషంగా ప్రాప్తి ఉంటుందన్నారు. ఈ సంవత్సరంలో వివాహయోగం అధికంగా ఉందని అన్నారు. యువత వివాహాలు అధికంగా పెరుగుతాయన్నారు. అనంతరం రామాలయ కమిటీ వారిచే ఏర్పాటు చేసిన షడ్రుచుల పచ్చడిని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అర్చకులు కందాడై శ్రీనివాసచార్యులు, కరుణశ్రీ, అర్థం రవీందర్, రాగిశెట్టి పుల్లయ్య, మన్యపు రెడ్డి, శ్రీనివాసులు, నర్మదా, సూర్య కుమార, కాంతయ్య, రమాదేవి,గిరి,విఠల్ సింగ్,నరసింహ,సుధాకర్, భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.