రామాయంపేటలో చిన్నారి బాలికల భవిష్యత్తును కాపాడే ఓ మహత్తర ఆరోగ్య యజ్ఞానికి నాంది
ఒక్క టీకాతో ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్‌కు అడ్డుకట్ట
బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది.
ప్రతిఘటన, రామాయంపేట రిపోర్టర్ చంద్ర ప్రతాప్
ఒక్క టీకాతో ఒక జీవితం సురక్షితం అని మున్సిపల్ చైర్ పర్సన్ బెజవాడ లావణ్య నాగరాజు అన్నారు. బాలికల భవిష్యత్తుకు కవచంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ అనే మౌన హంతకానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమం రామాయంపేటలో ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ బెజవాడ లావణ్య నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగంగా మాట్లాడుతూ.. మన పిల్లల ఆరోగ్యం కంటే గొప్పది ఏదీ లేదన్నారు. 14 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి బాలిక ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అని తెలిపారు. తల్లులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవానికి హాజరైన చైర్‌పర్సన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్‌పర్సన్ నవనీత గణేష్‌లను ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లింబాద్రి, వైద్య సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు. డీఐఓ డాక్టర్ మాధురి, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లింబాద్రి మాట్లాడుతూ.. మహిళలను గర్భకోశ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. చిన్న వయస్సులోనే టీకా వేయడం ద్వారా దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని వివరించారు. కౌన్సిలర్లు చౌదరి చరిత, గజవాడ నాగరాజు, శంకర్ గౌడ్, పుట్టి సందీప్, మాధవి రమేష్, రంజిత్, రవి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, నాయకులు చింతల యాదగిరి, అల్లాడి వెంకటేష్, ఎనిశెట్టి అశోక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
