prathighatana.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 1:32 pm Digital Edition : PRATHI GHATANA

ఉద్యమకారుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తెలంగాణ జాగృతి విశ్రమించదు

కవితక్క గర్జనతో దిగివచ్చిన సర్కార్‌

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

ఉద్యమకారుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తెలంగాణ జాగృతి విశ్రమించదని, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సాగుతున్న పోరాటం సత్ఫలితాలను ఇచ్చిందని, ఇది తెలంగాణ జాగృతి పోరాట పటిమకు దక్కిన విజయమని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఆయన ఒక ప్రకటనలో ఆయన ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఉద్యమకారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును వివరించారు. ​తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పాండురంగారెడ్డి స్పష్టం చేశారు. “ఉద్యమకారుల సమస్యలను గాలి కొదిలేస్తే సీఎం రేవంత్ రెడ్డి ని బంగ్లా బయటకు గుంజుతారు” అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన శక్తివంతమైన హెచ్చరికతోనే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని ఆయన అన్నారు. ఈ ఒత్తిడి ఫలితంగానే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వచ్చి ఉద్యమకారుల సమస్యలను వినడం, వారికి తక్షణమే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కేటీఆర్ మౌనంపై విస్మయం ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిని పాండురంగారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవైపు కవితక్క ఉద్యమకారుల కోసం అలుపెరగని పోరాటం చేస్తుంటే, మరోవైపు కేటీఆర్ కనీసం నోరు మెదపకపోవడం విస్మయం కలిగిస్తోందని అన్నారు. “అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసి, అసలైన ఉద్యమకారుల ఉనికి లేకుండా చేశామన్న అపరాధ భావనతోనే కేటీఆర్ ముఖం చాటేస్తున్నారా? లేక తన తప్పును ఇంకా తెలుసుకోలేదా?” అని తెలంగాణ సమాజం తరపున ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఏ కష్టం వచ్చినా, వారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినా కవితక్క ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలబడి పోరాడుతారని ఈ పరిణామం మరోసారి రుజువు చేసిందని పాండురంగారెడ్డి అన్నారు. ఉద్యమకారుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తెలంగాణ జాగృతి విశ్రమించదని ఆయన స్పష్టం చేశారు.