బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని నిందితులను అరెస్ట్ చేయాలి
వారిపై ఎస్వీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి
బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి
ఇందిమ్మ ఇంటితో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదిలేదు
సోషల్ జస్టీస్ పార్టీ జాతీయ అధ్యక్షులు చామకూర రాజు
కొవ్వోత్తులతో చిన్నారికి నివాళులు

ప్రతిఘటన, ఎల్బీనగర్ :
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో అమానవీయంగా ప్రవర్తించి రజక కుటుంబంపై దాడి చేసి రెండు నెలల పసిబిడ్డను పాషవికంగా కాలితో తన్ని చిన్నారి చావుకు కారణమైన అగ్రవర్ణ రెడ్డి కుటుంబాలను తక్షణమే అరెస్ట్ చేయాలని, నిందితులపై ఎస్వీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సోషల్ జస్టిస్ పార్టీ జాతీయ అధ్యక్షులు చామకూర రాజు డిమాండ్ చేశారు. కుమ్మెర గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనలో మృతి చెందిన రెండేళ్ల చిన్నారికి నివాళిగా సోమవారం సాయంత్రం ఎల్బీనగర్ ఆచార్య జ్యోతిభాపూలే విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చామకూర రాజు మాట్లాడుతూ.. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయకపోవడం విస్మయానికి గురి చేస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిందితులపై మర్డర్ కేసులతో పాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగం, ఇందిమ్మ పథకంలో సొంత ఇంటిని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని లేని పక్షంలో మానవహక్కుల సంఘాలకు, పౌర హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేసి రజక కుటుంబానికి న్యాయం సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. విసునూరు దొర రామచంద్రారెడ్డి మీద పోరాడి పెత్తందారి రెడ్లను తరిమిన వీర నారీ చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కే.వీ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలస్వామి, బీఆర్ఎస్ నాయకులు రామాచారి, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దేవరకొండ నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.