నాగోల్ డివిజన్లో అక్రమ నిర్మాణాల జోరు.. దార్..!!
అనుమతులు లేకున్నా యదేచ్చగా కొనసాగుతున్న షెడ్లు, షెటర్ల అక్రమ నిర్మాణ పనులు..!
ఎంఎంసీ ఆదాయానికి గండి.. టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు..?!!
అనుకోని విధంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులనే సందేహం..!
ఎంఎంసీ పెద్ద అంబర్పేట్ సర్కిల్ 11 టౌన్ ప్లానింగ్ అధికారులకు అవినీతి మరక..!
అందిన కాడికి దండుకుంటున్న వైనం..!
నాగోల్ అరుణోదయ కాలనీలో అక్రమ కమర్షియల్ షెడ్లు
డివిజన్ లో విచ్చలవిడిగా కొనసాగుతున్న షెటర్ల నిర్మాణానికి అండదండగా నిలుస్తున్న మాజీ తాజా కార్పొరేటర్ భర్త..!!
ప్రతిఘటన, ఎల్బీనగర్ ప్రతినిధి
మేడ్చల్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పెద్ద అంబర్ పెట్ సర్కిల్ 11లో ప్రాంతంలో ఆక్రమ కమర్షియల్ కట్టడాలు, అక్రమ షెడ్ల నిర్మాణ పనుల పరంపర జోరుగా సాగుతుంది. ఒక్క నాగోల్ డివిజన్ ప్రాంతంలోనే పదుల సంఖ్యలో అక్రమ షెడ్లు, షెటర్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అంటే టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క అండదండలు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్ధమవుతుంది. ఇప్పటికీ కొన్ని అక్రమ షెడ్లు, షెటర్ల నిర్మాణాలు పూర్తికాగా మరికొన్ని నిర్మాణాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఎంఎంసీ ఆదాయానికి భారీగా గండిపడుతూ అక్రమ నిర్మాణాల కొనసాగుతున్న తరుణంలో ఫిర్యాదులపై టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం వహించడం వెనక మతలబ్ ఏమిటో?ఎటువంటి అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ పెద్ద నిర్మాణాలకు అధికారుల అండదండలు ఏమోతాదులో ఉన్నాయో నిర్మాణాలు జరుగుతున్న జోరు అందుకు సజీవ సాక్ష్యాలుగా విలుస్తున్నాయి.
అనుమతులు లేకుండా నిర్మాణాల
మల్కాజ్ గిరి (ఎంఎంసి) సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు మామూళ్లు అందిస్తే చాలు అటువైపు కన్నెత్తి చూడరనే బహిరంగ ఆరోపణలు. వినిపిస్తున్నాయి. ఒకవేళ మామూళ్లు ఇవ్వకుంటే మాత్రం కన్నెర చేస్తారు.. వాటికి నోటీసులు ఇచ్చి మరి కూల్చివేస్తారు. ఎక్కడ లేని నిబంధనలను అమలు చేసేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. వారికి రావాల్సిన మామూళ్లు అందిస్తే అంతా మౌనమే. టౌన్ ప్లానింగ్ విభాగంలో క్రింది స్థాయిలో విధులు నిర్వహించే చైన్ మెన్ ల కేంద్ర బిందువుగానే అక్రమ వసూళ్ల దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సర్కిల్లో నాగోల్ డివిజన్ అరుణోదయ కాలనీ రోడ్ నెంబర్ 10 ప్రాంతంలో జరుగుతన్న భారీ షెడ్డు.. షెటర్ల ఇందుకు ఉదాహరణ. ఓ నిర్మాణదారు నుండి భారీ ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఏదో ఒక సాకు చూపి మళ్లీ నోటీసులు అందిస్తామని చెప్పి చేతులెత్తేస్తున్నారు. ఇదే తరహాలో డివిజన్ పరిధిలోని రాక్ టౌన్ కాలనీలో ప్రధాన రహదారి వెంటే చేపట్టిన భారీ వాణిజ్య షెడ్ల నిర్మాణం నిమర్శలకు తావిస్తున్నది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు, అక్రమ నిర్మాణాల నిరోధక ప్రత్యేక అధికారి, సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ, టీసీఎస్, చైన్ మెన్లు ఏమీ చేస్తున్నరు? అంటే ఎక్కడా సమాధానం లేదనే చెప్పాలి. ఈ ఆక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిన ఎంఎంసీ జోనల్ కమిషనర్ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంగానే అధికారులు ఆవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనేది జగమెరిగిన సత్యం. అక్రమ నిర్మాణాల జోరు పెరిగిందని, ఒక్క సర్కిల్లోనే పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటే ముక్కున వేలుసుకోవాల్సిందే. ఒక్కో నిర్మాణదారుని నుంచి వసూళ్లకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాలకు ఊతమిస్తున్నట్లు విమర్శలు అనేకం. అయితే నాగోల్ ప్రాంతంలో అక్రమ షెడ్డు నిర్మాణం పూర్తిగా కావస్తున్న చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద అంబర్ పేట్ టౌన్ ప్లానింగ్ అధికారులు షెడ్డు నిర్మాణం విషయంలో ఇప్పటికైనా చర్యలు తీసుకుని, భవిష్యత్తులో జరిగే సంఘటనలకు తావివ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదేనని స్థానిక కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ద్విచక్ర వాసహనం పెట్టే స్థలం లేకుండా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తే రోడ్డు ప్రమాదాలతో పాటు విపత్కరమైనటువంటి అగ్నిప్రమాదాలు సంబవించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో జరుగుతున్నటువంటి అక్రమ వాణిజ్య సముదాయాల నిర్మాణంపై ఇప్పటికై టైన్ ప్లానింగ్ అధికారులకు అనేక ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటో మరీ? అక్రమ షెడ్డు నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే నోటీసులు మాత్రమే ఇవ్వడం తమ విధి అన్ని.. చర్యలు తీసుకునే అధికారం ఉన్నతాధికారులకు మాత్రమే ఉంటుందని టౌన్ ప్లానింగ్ క్రింది స్థాయి సిబ్బంది తెలవడం కొసమెరుపు. ఈ అంశంలో ఎంఎంసీ పెద్ద అంబర్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏవిధంగా స్పందిస్తారో వేవిచూద్దాం. నాగోల్ అక్రమ షెడ్డు విషయంలో చర్యలు తీసుకోకపోతే ఆయన పదవికే ఎసరు వస్తుందని చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో..?
అక్రమ నిర్మాణాల్లో తాజా మాజీ కార్పొరేటర్ భాగస్వామి అంటా..?
నాగోల్ డివిజన్ పరిధిలో జరిగే అక్రమ నిర్మాణలకు వంత పాడుతూ తాజా మాజీ కార్పొరేటర్ భర్త తాను కూడా వాటిలో భాగస్వామ్యం అంటున్నాడు. ఇదెక్కడి చోద్యం. తాజా మాజీ అయిన భార్య పేరు చెప్పుకుంటూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నాడు. ఒకవేళ తాను భాగస్వామి అయినా నిబంధనల ప్రకారం.. బల్దియ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత. కానీ అవన్నీ పక్కన పెడుతూ.. తాను తాజా మాజీ కార్పొరేటర్ భర్త ముసుగులో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాడు. పత్రికలో వార్త రాస్తే ఏమవుతుంది బొచ్చు పీక్కుంటారా.. అంటూ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడు. తాజా మాజీ కార్పొరేటర్ భర్త అయితే అక్రమ నిర్మాణాన్ని ఆపలేరా..? అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది. నాగోల్ అరుణోదయ కాలనీ రోడ్ నెంబర్ 10 లో వెలిసిన బాబాయ్ హోటల్ అక్రమ నిర్మాణమే ఎందుకు నిదర్శనం. దీనిపై ముడుపులు మింగిన అధికారులు చర్యలు తీసుకుంటారా.. లేదా..? అనేదే ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.