prathighatana.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 1:50 pm Digital Edition : PRATHI GHATANA

అంబేద్కర్ కీర్తి అజరామరం, అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయం

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

అంబేద్కర్ కీర్తి అజరామరం, అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయమనీ లెజెండ్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు తెలిపారు. కమలానగర్ కాలనీ (60వ డివిజన్) లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద లెజెండ్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా బాబాసాహెబ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పీడిత ప్రజల పక్షాన పోరాడిన విశ్వమానవుడు అంబేద్కర్ అని అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన భీమ్‌రావు, చిన్నప్పటి నుంచే కుల వివక్షను అత్యంత దారుణంగా ఎదుర్కొన్నారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో సమానంగా కూర్చునే అవకాశం లేకపోయినా, చదువు ద్వారానే తన జీవితాన్ని, సమాజాన్ని మార్చగలనని ఆయన బలంగా నమ్మారన్నారు. ఆ పట్టుదలే ఆయనను ఉన్నత విద్య వైపు నడిపించిందన్నారు. అంబేద్కర్ బోధనలను, ఆశయాలను, విలువలను భావితరాలకు అంటరానితనం, కుల వివక్ష లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి నిరుపమానమన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర అజరామరమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, పలు రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, లెజెండ్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.