మహేశ్వరం, ప్రతిఘటన ప్రతినిధి ముత్తయ్య

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి మాన్యం బావి దేవాలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ చైర్మన్ గూడూరు కొండారెడ్డి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. కందుకూరు మండల పరిధిలోని అతి ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అట్టహాసంగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు కొడవటి కంటి రామకృష్ణ శర్మ, తోషన్ ద్వివేది అమ్మవార్ల కళ్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణాల మధ్య, మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కళ్యాణ వేడుకలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి

స్వామివారి కళ్యాణాన్ని కనులారా చూసి తరించారు. స్వామివారి కళ్యాణం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని భక్తులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు లేమూరు గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామివారి ఆలయానికి ఉచితంగా ఆటోలు ఏర్పాటు చేసి వాటి ద్వారా భక్తులను తీసుకొచ్చారు. తీసుకెళ్లారు. మంచి నీటి సౌకర్యం కల్పించారు, ఎండకు ఇబ్బందులు లేకుండా చల్లటి పందిర్లు వేయించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామిని ప్రశాంతంగా దర్శించుకున్నామని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ జడ్పిటిసి చైర్ పర్సన్ తీగల రెడ్డి అనితా రెడ్డి, ఎమ్మెల్సీ పాల్వాయి స్రవంతి, ఖైరతాబాద్ మాజీ కార్పొరేటర్ విజయా రెడ్డి, మాజీ ఎంపీటీసీ మూల హనుమంతు రెడ్డి, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ రామ్ ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాలకృష్ణ, కోశాధికారి రాఘవేందర్, సంయుక్త కార్యదర్శి జైపాల్ ఐలయ్య, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, కే. భూపాల్ రెడ్డి, నాయకులు మొహమ్మద్ రహీం, మంచాల భాస్కర్, గుల్వి దేవేందర్, గుర్రం సత్తయ్య, మంచాల రాజేష్, డీజే దర్శన్ , సుధాకర్ భక్తులు పాల్గొన్నారు.